Sep 26,2023 09:02
  • నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలపై తెలంగాణ క్యాబినెట్‌ సిఫార్సు తిరస్కరణ

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఇద్దరు నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు. ఆర్టికల్‌ 171 (5) ప్రకారం వారికి అర్హతలు సరిపోవని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్‌ వారం క్రితం పంపిన సమాచారం సోమవారం వెలుగులోకి వచ్చింది. దీంతో, నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల నియామకం మరోసారి వివాదాస్పదమైంది. గతంలో కౌశిక్‌ రెడ్డి నియామక ప్రతిపాదనను కూడా గవర్నర్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్‌ నేతలు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను గవర్నర్‌ కోటా కింద శాసనమండలికి నామినేట్‌ చేయాలని ఈ ఏడాది జులై 31న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన గవర్నర్‌... వీద్దరికీ తగిన అర్హతలు లేవంటూ, వారిని నామినేట్‌ చేయడం తగదంటూ సిఎంకు, సిఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 'అర్హతలు ఉన్న ఎంతోమంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. వారిని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైంది కాదు. ఇలా చేస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించదు. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుంది. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్‌ చేయకూడదో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలనూ జత చేయలేదు' అని గవర్నర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయంపై మంత్రులు, బిఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చి గవర్నర్‌ రాజకీయాలు చేస్తున్నారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. ఒక రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న మీరు తెలంగాణకు గవర్నర్‌గా నియమించబడలేదా? అని తమిళిసైని ఉద్దేశించి అన్నారు. గవర్నర్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విమర్శించారు.