Oct 04,2023 10:54

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి : 'రాష్ట్ర సుస్థిరతకు జనసేన, టిడిపి కలిశాయి. దీన్ని చెడగొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం పథక రచన చేస్తోంది. జనసేన చేపట్టిన వారాహి విజయయాత్రను అడ్డుకునేందుకు జగన్‌ ప్రభుత్వం కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.' అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. నాలుగో విడత వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో ''జనవాణి-జనసేన భరోసా'' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ తరగతులు, వర్గాల ప్రజల నుంచి 200లకుపైగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ పెడనలో జరిగే బహిరంగ సభలోకి కొందరు గూండాలను, క్రిమినళ్లను చొప్పించి రాళ్లదాడి చేయడానికి ప్రభు త్వం పకడ్బందీ వ్యూహం రచించినట్లు స్పష్టమైన సమాచారం ఉంద న్నారు. ఇటువంటి గొడవలను జనసేన సహించదని హెచ్చరిం చారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిపై జనసైనికులు ఎదురుదాడి చేయవద్దని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దాడులు చేస్తే డిజిపికి, రాష్ట్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
 

                                              పవన్‌కు నడుం నొప్పి.. జనవాణి నుండి నిష్క్రమణ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నారు. గత మూడు రోజులుగా ఆయన కష్ణా జిల్లాలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనవాణిలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అయితే నడుం నొప్పి కారణంగా ఆయన కొన్ని అర్జీలను మాత్రమే తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన జనవాణిలో చెప్పి మధ్యలోనే నిష్క్రమించారు. దీంతో జనసేన నేతలు మిగిలిన అర్జీలను స్వీకరించారు.