హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో గణేశుడి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సాగర్ చుట్టుపక్కలా వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఎదురుచూస్తున్నాయి. రద్దీ నేపథ్యంలో ... పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వైపుగా విగ్రహాల వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. సచివాలయంతోపాటు ట్యాంక్‌బండ్ చుట్టుపక్కల రహదారులపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు సాధారణ వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఈ మధ్యాహ్నం వరకు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకు 19,870 విగ్రహాలు నిమజ్జనం..
హుస్సేన్ సాగర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 19,870 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్‌లో 3,150, ఖైరతాబాద్ జోన్‌లో 2,059 చార్మినార్ జోన్‌లో 983, కూకట్‌పల్లి జోన్‌లో 4,581, శేరిలింగంపల్లి జోన్‌లో 5,934 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు.
బారులుతీరిన విగ్రహాలు....
సాగర్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి అర్ధరాత్రి తర్వాత విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకురావడంతో ఉదయం పెద్దసంఖ్యలో విగ్రహాలు సాగరంవైపు కదిలాయి. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా నిమజ్జన సందడి కొనసాగుతూనే ఉంది.










