- 27 నుంచి అమలులోకి
- జిఓ 1973 విడుదల
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యులై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఈ నెల 27 నుంచి 2024 జనవరి 5న ఓటర్ల తుది జాబితా రూపొందించే వరకు నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిఓ నెంబరు 1973ను ప్రభుత్వం విడుదల చేసింది. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వామ్యులైన సిబ్బంది ఖాళీల వివరాలను ఈ నెల 10లోగా అందివ్వాలని ఆదేశించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 13సిసి నిబంధన ప్రకారం ఓటర్ల జాబితా తయారీ, సవరణ, సవరణలకు సంబంధించి ఏ అధికారి లేదా సిబ్బందిని నియమించినా వారు ఆన్‌లోనే ఉన్నట్లుగా పరిగణించబడతారని అందులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు డిప్యూటేషన్ చేసిన వారు పనిచేసిన కాలానికి అటువంటి అధికారి, సిబ్బంది ఆ కాలంలో ఇసిఐ నియంత్రణ, పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు.










