హరారే : జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హీత్ స్ట్రీక్ ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశ మాజీ క్రీడల శాఖ మంత్రి డేవిడ్ కోల్టార్ట్ శనివారం ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. స్ట్రీక్ త్వరగా కోలుకుని రావాలని దేశ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారని అందులో వెల్లడించాడు. జింబాబ్వే క్రికెట్‌కు స్వర్ణయుగంగా చెప్పుకునే 90వ దశకంలో జట్టులోకి వచ్చిన హీత్ స్ట్రీక్. 1993లో జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 65టెస్టులు ఆడిన హీత్ స్ట్రీక్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 216 వికెట్లు తీయడంతో పాటు 11 అర్ధ సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు హీత్ స్ట్రీక్. కెరీర్‌లో 189 వన్డేలు ఆడి 239 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ 13అర్ధ సెంచరీలు చేశాడు. అతడు తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. 21టెస్టుల్లో, 68వన్డేల్లో హీత్ స్ట్రీక్ జింబాబ్వేకు సారథ్యం వహించాడు. గొప్ప కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2021లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఎనిమిది సంవత్సరాలు పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) నిషేధం విధించింది.










