Sep 26,2023 16:03
  •  పరుగులు తీసిన ప్రయాణికులు

ప్రజాశక్తి - ఉంగుటూరు, తాడేపల్లిగూడెం : లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నెంబరు 12806) రైలు బోగీ చక్రాల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు రైలు దిగి ఫ్లాట్‌ఫారం వైపు పరుగులు తీశారు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు మంగళవారం సాయంత్రం 3.45కు ప్లాట్‌ఫారం నంబరు రెండులో జన్మభూమి రైలు ఆగింది. వెనుక నుంచి మూడో బోగీ చక్రాల వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగలు వచ్చాయి. దీంతో ఆ బోగీలోని ప్రయాణికులు భయాందోళనతో రైలు దిగి పట్టాలు, ప్లాట్‌ఫారం వైపు పరుగులు తీశారు. వెంటనే రైల్వే పోలీసులు, సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపుచేశారు. క్షుణ్ణంగా పరిశీలించాక ఎలాంటి ప్రమాదం లేదని నిర్థారించుకున్న తర్వాత 4.05 గంటలకు స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరి విశాఖపట్నం చేరుకుంది. బ్రేకు పట్టేయడంతో తొలుత చక్రానికి, బ్రేకు దిమ్మల మధ్య రాపిడికి మంటలు వచ్చాయని రైల్వే ఎస్‌ఐ జి.హరిబాబు, స్టేషన్‌ మాస్టర్‌ నాగరాజు, అధికారులు వెల్లడించారు. సుమారు 20 నిమిషాలపాటు స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.