Sep 20,2023 11:58

ప్రజాశక్తి - పిచ్చా టూరు (తిరుపతి జిల్లా) : పిచ్చాటూరు మండలం రామాపురం దళితవాడకు చెందిన అవయవదానం చేసిన కీర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల నగదు చెక్కును ఎమ్మెల్యే ఆదిమూలం బుధవారం కీర్తి కుటుంబానికి అందజేశారు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కీర్తి తాను మరణిస్తూ ఏడుగురికి అవయవ దానం చేయడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. కీర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఆమె ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడికి ప్రైవేటు ఫ్యాక్టరీలలో ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కీర్తి విషయాన్ని ముఖ్యమంత్రి కి చెప్పిన వెంటనే రూ.5 లక్షలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కీర్తి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

                                                              కీర్తి కుటుంబానికి శ్రీసిటివారి ఆర్థిక సహాయం

తాను మరణిస్తూ మరో ఏడుగురికి అవయవదానం చేసిన పిచ్చాటూరు మండలం రామాపురం దళిత వాడికి చెందిన కీర్తి కుటుంబానికి శ్రీ సిటీ తరపున ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా రూ.50,000 ఆర్థిక సహాయం కీర్తి కుటుంబానికి అందజేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తికి బ్రెయిన్‌ డెడ్‌ కావడం ఆమె కోరిక మేరకు వారి కుటుంబ సభ్యులు కీర్తి లోని ఏడు అవయవాలను చెన్నైలోనే రాజీవ్‌ గాంధీ ఆసుపత్రికి దానం చేయడం జరిగింది. బాధిత కుటుంబం నిరుపేద కావడం, కీర్తి కి మరో ఇద్దరు చెల్లెలు ఓ తమ్ముడు కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి తమ వంతు సహాయంగా శ్రీ సిటీ స్పందించింది. ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందుకున్న కీర్తి కుటుంబం శ్రీ సిటీకి గ్రామస్తులు, ప్రజా ప్రజల సమక్షంలో శ్రీ సిటీ ఎండి డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సత్యవేడు ప్రాంతంలో విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో శ్రీ సిటీ స్పందిస్తున్న తీరు ఆదర్శనీయంగాను, అనుసరణీయంగా ఉందని ఎమ్మెల్యే ఆదిమూలం ప్రశంసించారు.