విజయవాడ : వైఎస్సార్ వాహన మిత్ర ఐదో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలోని విద్యాధరపురంలో విడుదల చేశారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నివాసం నుండి విద్యాధరపురానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. విద్యాధరపురం స్టేడియంకు చేరుకున్న ముఖ్యమంత్రి.... అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి వైఎస్సార్ వాహనమిత్ర నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ఎండీయూ ఆపరేటర్లకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా నగదు జమ అయ్యింది. ఆటోడ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కాను ధరించిన సిఎం జగన్.. వేదికపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ ... బతుకు బండి లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం అని అన్నారు. వాహనం ఇన్యూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర అందజేస్తున్నామన్నారు. ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు అండగా నిలిచేందుకే ఈ పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. ఈరోజు రూ.276 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని సిఎం ప్రకటించారు. వైఎస్సార్ వాహన మిత్రతో ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ది చేకూరుతుందన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు. '' ఇది జగనన్న ప్రభుత్వం కాదు.. ఇది మీ అందరి ప్రభుత్వం '' అని సిఎం జగన్ అన్నారు.
గత పాలకులకు మనసు లేదు... : సిఎం జగన్
వాహనాలకు ఇన్స్యూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోవాలని సిఎం జగన్ సూచించారు. ఎంతోమంది ప్రయాణికులకు డ్రైవర్లు సేవలందిస్తున్నారని ప్రశంసించారు. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లు ఇంటికే అందిస్తున్నామని అన్నారు. పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామన్నారు. వలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. అర్‌బీకేలతో రైతులకు అండగా నిలిచామని సిఎం తెలిపారు. పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలు చూశానన్నారు. వారి సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయంగా అందుతుందని, మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచామని అన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం అని సిఎం వివరించారు. చిరు వ్యాపారులకు రూ.2,956 కోట్లు సాయం అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్ కాపునేస్తంతో రూ.2,029 కోట్లు సాయం అందించామన్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించామని చెప్పారు. గత పాలకులకు మనసు లేదనీ.. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికీ.. నిరుపేదలను వంచించిన గత ప్రభుత్వానికీ మధ్య యుద్ధం జరుగుతుందని సిఎం అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని విమర్శించారు.
త్వరలో కురుక్షేత్ర యుద్ధం : సిఎం జగన్
త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని సిఎం జగన్ ప్రకటించారు. లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్, స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల స్కామ్, అమరావతి పేరుతో స్కాములు చేసిన గత ప్రభుత్వంతో యుద్ధం జరుగుతోందన్నారు. గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సిఎం ఒక్కడేనని చెప్పారు. గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు ? అని ప్రశ్నించారు. '' దోచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలి.. దోచుకున్నది పంచుకునేందుకే వాళ్లకు అధికారం కావాలి.. వాళ్లకు మాదిగా నాకు గజ దొంగల ముఠా తోడుగా లేదు.. దోచుకుని పంచుకుని తినుకోవడం నా విధానం కాదు..'' అని సిఎం జగన్ అన్నారు.










