- ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ వార్షిక స్నాతకోత్సవం ప్రారంభం
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : రైతు సంక్షేమం దేశానికి చాలా ముఖ్యమైనదని, దేశ శ్రేయస్సు ప్రత్యే కంగా వ్యవసాయ రంగంపై ఆధార పడి ఉంటుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ వార్షిక స్నాతకోత్సవాన్ని విజయవాడ రాజ్‌భవన్ నుండి వీక్షణ సమావేశం ద్వారా గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యాభోదన, పరిశోధన, విస్తరణ సేవలలో ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు ప్రఖ్యాతలు గాంచిందన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా వంద మేడ్ ఇన్ ఇండియా అగ్రికల్చరల్ డ్రోన్‌లను ప్రారంభిం చారని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించే పరిశోధనలో మన దేశంలో అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల కంటే ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం ముందు ఉందని తెలిపారు. నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ రమేష్ చంద్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రానంతరం స్థాపించబడిన మొట్టమొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం ఒకటన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ రెడ్డి నివేదిక సమర్పించారు. స్నాతకోత్సవంలో 869 విద్యార్థినీ, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో పరోక్షంగా 462 విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లు అందుకున్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ ఎ.మణి, డాక్టర్ జాన్ వెస్లీ పాల్గొన్నారు.










