Oct 05,2023 21:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ ఫెయిలైన విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లించే తేదీ గడువును ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చిలో జరగనున్న పరీక్షలకు సెప్టెంబరు 30లోపు ఫీజు చెల్లించాలని గతంలో వెల్లడించారు. ఇప్పుడు నవంబరు 30 వరకు ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. ఫైయిలైన, డ్రాపవుట్‌ అయిన జనరల్‌, వొకేషన్‌ కోర్సుల విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా చెల్లించాలని వివరించారు. ప్రథమ, లేదా ద్వితీయ సంవత్సరం జనరల్‌, వొకేషషన్‌ కోర్సుల విద్యార్థులు థియరీ పేపర్లకు రూ.550, ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.150 చెల్లించాలన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండు సబ్జెక్టులకు హాజరయ్యే విద్యార్థులు రూ.1100, ప్రాక్టికల్‌ పరీక్షలకు రూ.500, పరీక్ష ఫీజు కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫెయిలైన విద్యార్థి మరలా కళాశాలలో అడ్మిషన్‌ పొంది అన్ని పరీక్షలకూ హాజరైతే ఎక్కువ మార్కులు వచ్చిన దానిని పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. కంపర్ట్‌మెంటల్‌, ఫైయిల్‌ అని కాకుండా ఒకేసారి ఉత్తీర్ణులయ్యారని సర్టిఫికెట్‌ జారీ చేస్తామని పేర్కొన్నారు. తిరిగి అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి వాటికి అర్హులేనని వివరించారు.