Sep 26,2023 15:31

హైదరాబాద్‌ : డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్‌ జి సతీశ్‌ రెడ్డి మంగళవారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గన్నారు. సికింద్రాబాద్‌లోని డాక్టర్‌ సైంటిస్ట్‌ హాస్టల్‌లో రాజ్యసభ సభ్యులు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి సతీశ్‌ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా జి సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైనది కాలుష్యం అని తెలిపారు. మనిషి తన అవసరాల కోసం సృష్టించిన ప్లాస్టిక్‌ యావత్‌ భూమండలాన్ని కల్లోలం చేస్తున్నాయి. దీని నుంచి మనిషి బయటపడటానికి లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు.. కాలుష్యం సృష్టించిన విలయం వల్ల ప్రతి రెండు ఇళ్లలో ఒకరు హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి దాపురించింది. కాలుష్యం అనేది ఒక్క గాలికి, నీరుకు సంబంధించిందో కాదు.. మన జీవిత ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోలితం చేస్తుంది. అందుకే నేడు లక్షల బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తూ వేరే గ్రహాల్లో జీవన అవకాశాలు కోసం పరిశోధిస్తున్నాం. ఈ సమస్యలన్నింటికి ఏకైక పరిష్కారం మొక్కలు నాటడం. ఆ పని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంతోష్‌ కుమార్‌ చేస్తున్న కఅషిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములం కావల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సతీశ్‌ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌ మెంబర్స్‌ రాఘవ, కర్ణాకర్‌ రెడ్డి, ఇతర సైంటిస్టులు పాల్గొన్నారు.