Oct 08,2023 21:39

ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో :తిరుపతి వాసులకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్‌ను తిరుపతి నగరపాలక సంస్థ సిద్ధం చేసింది. నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఉన్నాయి. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు నగరపాలక సంస్థ ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. నగరంలో డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రిక్‌ ఎసి బస్సులను ప్రారంభించడంతోపాటు త్వరలో మరిన్ని బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్‌ అభినరు చొరవ మేరకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. నగరంలో ట్రయిల్‌ రన్‌ వేసిన కొత్త బస్సును భూమన అభినరు పరిశీలించారు. ప్రయివేటు బస్సులకు దీటుగా అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సును తీసుకువచ్చామని, ఈ బస్సుల్లో ప్రస్తుతానికి జర్నీ ఫ్రీ అని, టికెట్‌ అవసరం లేకుండానే ప్రయాణం చేయవచ్చని, వారం రోజుల తర్వాత మినిమం ఛార్జీ విధించే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరి నుంచి రూ.50 మాత్రమే వసూలు చేసే అవకాశం ఉందని చెప్పారు. వీటిని చూసేందుకు జనాలు అమితాసక్తిని కనబరుస్తున్నారు. పర్యాటకుల స్పందన బట్టి మరిన్ని బస్సులు తీసుకువచ్చే ఆలోచనలో తిరుపతి నగర పాలక సంస్థ ఉంది.