- అంతర్జాతీయ వీల్‌ఛైర్ 20ట్వంటీ క్రికెట్ టోర్నీకి ప్రవీణ్ ఎంపిక
ప్రజాశక్తి- ధవళేశ్వరం(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతులు మానుపాటి ప్రవీణ్‌కుమార్ భారత క్రికెట్‌జట్టులో చోటు సంపాదించారు. ఈ నెల 9 నుంచి 11 వరకు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే వీల్‌ఛైర్ 20ట్వంటీ క్రికెట్ టోర్నీలో భారత జట్టుకు ప్రవీణ్ ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ మేరకు డిసిసిబిఐ (దివ్యాంగ్ క్రికెట్ కంట్రోల్‌బోర్డు ఆఫ్ ఇండియా) 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆ జట్టులో ప్రవీణ్‌కు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రవీణ్‌కుమార్ ఒక్కడే భారతజట్టుకు ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో భోపాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని రాణించారు. ఇండియా తరుఫున ఆడే అవకాశం రావడం పట్ల ప్రవీణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను పలువురు అభినందించారు.










