ప్రజాశక్తి - వన్‌టౌన్ (విజయవాడ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ ఆలయలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 15 నుండి 23వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను నిర్వహిం చనున్నారు. దీనిలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభమయ్యే మూడు క్యూలైన్ల వద్ద, ఘాట్ రోడ్డులోని గోపురం వద్ద స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో దుర్గమ్మను తొమ్మిది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. మొదటిరోజు ఆదివారం బాలాత్రిపుర సుందరీ దేవిగా, 16న గాయత్రీదేవిగా, 17న అన్నపూర్ణాదేవిగా, 18న మహాలక్ష్మీదేవిగా, 19న లలితా త్రిపుర సుందరి దేవిగా, 20న సరస్వతీ దేవిగా, 21న దుర్గాదేవిగా, 22న మహిషాసురమర్థినిగా, 23న రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మను అలంకరిస్తారని చెప్పారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దుర్గమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పి స్తారన్నారు. ప్రతిరోజూ తెల్లవారుజాము 3 నుంచి రాత్రి 11 గంటల వరకూ దుర్గమ్మను దర్శించు కోవచ్చని చెప్పారు. ఇంద్రకీలాద్రిపైకి వివిఐపిలు, విఐపిల కార్లకే అనుమతిస్తారన్నారు. మిగిలిన వారు దేవస్థానం బస్సుల్లోగానీ, నడక మార్గంలో గానీ రావాల్సి ఉంటుందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు లిఫ్ట్ సౌకర్యం ఉందన్నారు. మీడియా ప్రతినిధులకూ కూడా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.










