విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఆదివారం బెజవాడ దుర్గమ్మ బాలత్రిపురసుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దుర్గమ్మను తొలి దర్శనం చేసుకున్నారు. గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మ ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఆదివారం కావడంతో దుర్గమ్మ గుడికి భక్తులు పోటెత్తారు. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపట్టారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.










