Dec 26,2022 08:08

నాకు ఉగాది అంటే ఇష్టం
పరాయి కొత్త సంవత్సరమంటే
పరమ అసహ్యం..
తాగి ఊగిపోవడమంటేనే
అరికాలిమంట నెత్తికెక్కుతుంది
కారణం ఆ రోజు తప్ప మావాళ్ళు
మద్యం వాసన కూడా చూడరు
అందుకే ప్రచారం మొదలెడతాను
మనది కాదు ఈ సంస్కృ తి
జనవరి ఒకటే విష సంస్కృతి అని ...

పేజీలు తిప్పేస్తున్న కేలండర్‌
ఎవరిదని మాత్రం అడగను
ఉగాది తెలుగు వారిదే
ఆంగ్లం బతకడానికే అంటాను
తెలుగును చంపేసి
ఉగాదిని, సంస్క ృతిని బతికిస్తాను ..!

గుండెలనిండా ప్రాణవాయువులా
పరాయి భాషను శ్వాసిస్తాను
ఏడాదికోసారి కొత్త వత్సరాన్ని ద్వేషిస్తాను
మన భాషను పండుగల్ని
పరిరక్షించేందుకే మా పిల్లల్ని
విదేశాల విమానాలెక్కిస్తాను
డాలర్‌ కలలు కంటూనే
డాంబికాల డామినేషన్‌ మొదలెడతాను
తెలుగును అంపశయ్యపై పడుకోబెట్టి
ఆంగ్ల సంవత్సరాదిని అడ్డంగా నరికేస్తానని
ఆత్మాభిమాన ప్రదర్శనలిచ్చేస్తాను.!

అన్నీ పరాయివి అనుభవిస్తూనే
ఆంగ్ల సంవత్సరాది మీద
ఆత్మవంచన ప్రచారం మొదలెడతాను!
పరాయి భాషతో పాటు
వారి జాడ్యాలూ వస్తాయనే నిజం దాచి
ఆంగ్ల వత్సరం మీద అగ్ని వర్షమై కురుస్తాను
జనవరి రెండోతేదీ నుండి అన్నీ మరచి
పరాయి గాఢ పరిష్వంగంలో మత్తుగా జోగుతాను!

- వెన్నెల సత్యం
94400 32210