Jun 29,2023 21:05

18 శాతానికి చేరిన నిరర్థక ఆస్తులు
చెల్లింపుల్లో భారీగా విఫలం
ఆర్‌బిఐ వెల్లడి

న్యూఢిల్లీ : క్రెడిట్‌ కార్డ్‌లపై ఆధారపడే సంస్కృతి బాగా పెరిగింది. బ్యాంక్‌లు కూడా అడగ్గానే క్రెడిట్‌ కార్డ్‌లను జారీ చేస్తున్నాయి. తీరా వాడుకున్న తర్వాత ఆదాయాలు లేక, అధిక వడ్డీ రేట్ల బెంబేలుతో అనేక మంది తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో క్రెడిట్‌ కార్డ్‌ల నిరర్థక ఆస్తులు భారీగా పేరుకుపోతున్నాయి. ఈ రంగంలో కేవలం ఒక్క ఏడాదిలోనే రెట్టింపు ఎన్‌పిఎలు నమోదు కావడం ఆందోళకరం. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్‌ కార్డ్‌ ఎన్‌పిఎలు 18 శాతానికి ఎగిశాయని ఆర్‌బిఐ గణంకాలు వెల్లడించాయి. గతేడాది ఇదే కాలంలో దాదాపు 9 శాతంగా ఉంది. 2022 సెప్టెంబర్‌ నాటికి 15 శాతంగా నమోదయ్యాయి. ఈ వివరాలను ఆర్‌బిఐ తన ఆరు మాసాల ఆర్థిక స్థిరత్వ నివేదికలో వెల్లడించింది.
క్రెడిట్‌ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్‌ సహా అసురక్షిత రుణాలపై ఆర్‌బిఐ గణంకాలు హెచ్చరికలను జారీ చేశాయి. మరోవైపు ప్రయివేటు రంగ బ్యాంక్‌ల క్రెడిట్‌ కార్డ్‌ల ఎన్‌పిఎలు యథాతథంగా 1.9 శాతంగా, విదేశీ బ్యాంక్‌ల కార్డ్‌ల ఎన్‌పిఎలు 1.8 శాతంగా చోటు చేసుకున్నాయి. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో 2023 మార్చి ముగింపు నాటికి మొత్తం ఎన్‌పిఎలు 3.9 శాతం తగ్గి.. పదేళ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యాయి. 2024 మార్చి ముగింపు నాటికి 3.6 శాతానికి తగ్గొచ్చని అంచనా. అధిక ద్రవ్యోల్బణం, రుణ ఖర్చులు పెరగడం వల్ల కుటుంబాల ఆర్థిక స్థితి, వారి రుణాల చెల్లింపు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్‌బిఐ విశ్లేషించింది. ఇది రుణాలు ఇచ్చే బ్యాంకులపై ఒత్తిడి పెంచనుందని పేర్కొంది.