ప్రజాశక్తి- తిరుపతి (మంగళం):అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులకు జనసేన భయపడదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. తిరుపతిలో ఆదివారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించలేదని, అందుకే తమ పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపి, క్షేత్ర స్ధాయిలో జరిగే అనేక అంశాలపై అందరితో మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు. చిన్నచిన్న కార్యక్రమాలు చేసినా జనసైనికులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడమని హెచ్చరించారు. చంద్రబాబుని జైల్లో పెట్టిన సందర్భంలో ఆయన్ని కలిసి భవిష్యత్తులో టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడానికి తమ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎవరు సిఎం అవ్వాలనే దానికంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. జనసేనలో నాయకత్వ లోపంలేదని, జనసైనికులంతా నాయకులేనని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. డాక్టర్ హరిప్రసాద్ లాంటి నాయకులు చిత్తూరు జిల్లాకు చాలని, భూ ఆక్రమణలు చేసిన వాళ్లు, వందల కోట్లు దోచుకున్న వారు తమకు అవసరం లేదన్నారు. రాయలసీమలో చాలా బలంగా వారాహి యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజరు కుమార్, ఆస్ట్రేలియా కో ఆర్డినేటర్ కలికొండ శశిధర్, నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, కీర్తన పాల్గొన్నారు.










