Sep 22,2023 10:29

ప్రజాశక్తి-అమరావతి : అన్నమయ్య జిల్లా, అంగళ్లు, భీమగానిపల్లె క్రాస్‌ రోడ్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ముదివేడు, పుంగనూరు పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలకు హైకోర్టులో ఊరట లభించింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పలువురు నేతలను తదుపరి విచారణ వరకు అరెస్ట్‌తోపాటు ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గురువారం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
           విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇవే కేసుల్లో పలువురు నిందితులకు కోర్టు ముందస్తు బెయిల్‌ దాఖలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ ఎస్‌ఎల్‌పిలో సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
 

                                                                             పలువురికి బెయిల్‌

మాజీ సిఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పుంగనూరు పోలీసులు నమోదు చేసిన కేసులో చిత్తూరు జిల్లా, వెంకటగిరికోట మండలానికి చెందిన పలువురు టిడిపి నేతలకు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. పిటిషనర్లు ఘటనా స్థలంలో ఉన్నట్లు తప్పుగా ఫిర్యాదు చేశానని ఫిర్యాదుదారుడు ప్రకటన గురించి పిటిషనర్లు మెమో దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి పరిశీలించి టిడిపి నేతలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. ఎఎమ్‌ రంగనాథ్‌, ఎం సోమప్ప, బిఆర్‌ రాంబాబు నాయుడు, ఎస్‌ కొండారెడ్డి, జిఎ భక్తవత్సలం, సి విశ్వనాథ్‌, ఆర్‌ రాంబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. ఇదే కేసులో అరెస్టయిన 79 మంది టిడిపి కార్యకర్తలకు బెయిల్‌ మంజూరు చేశారు. మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని పిటిషనర్లను ఆదేశించారు.
 

                                                                 బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్ల మార్పు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో అక్రమాలపై సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది.
          మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఇదే కేసుకు సంబంధించి ఎసిబి కోర్టులో సిఐడి పిటి వారెంట్‌ వేసిందని చంద్రబాబు తరపున న్యాయవాది ఎస్‌ ప్రణతి తెలిపారు.