Sep 21,2023 15:45

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రూ.50వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు' అని గతంలో పెద్దలు అనేవారని, కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ మాత్రం.. 'ఇల్లు నేనే కట్టిస్తా...పెళ్లి నేనే చేయిస్తా' అంటున్నారని అన్నారు. నగర శివారులోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. గురువారం నగర వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో మేయర్‌ ఆధ్వర్యంలో మంత్రులు రెండో విడతగా 13,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి 500, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి 300, సనత్‌నగర్‌ నియోజకవర్గానికి 500, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని, జగద్గిరిగుట్ట డివిజన్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలికి కూడా ఇల్లు వచ్చిందని కేటీఆర్‌ వెల్లడించారు. ఎన్నికల లోపు గ్రేటర్‌ పరిధిలో లక్ష ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోందని కేటీఆర్‌ తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి హామీలను నమ్మొద్దని అన్నారు.