Sep 24,2023 08:58

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, ఎవరి వద్దా కొనుగోలు చేయలేదని నటుడు నవదీప్‌ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు శనివారం ఆయన హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని నార్కోటిక్‌ బ్యూరో కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్‌ విక్రయదారుడు రామ్‌చంద్‌తో పరిచయం ఉంది కానీ, డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని విచారణాధికారులకు ఆయన తెలిపారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ, నార్కోటిక్‌ బ్యూరో అధికారులు నోటీసు ఇస్తే వచ్చానని చెప్పారు. టిఎస్‌ నార్కోటిక్‌ అధికారులు ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా తనను విచారించారని చెప్పారు. బిపిఎం క్లబ్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీశారని తెలిపారు. గతంలో కూడా సిట్‌, ఇడి విచారించిందని గుర్తు చేశారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీనటుడు నవదీప్‌ను విచారించామని, అన్ని ప్రశ్నలకూ ఆయన సమాధానాలిచ్చారని యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్‌పి సునీతారెడ్డి తెలిపారు. 'మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో 81 లింకులు గుర్తించాం. 41 లింకుల వివరాలను నవదీప్‌ తెలిపారు. డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు సిట్‌, ఇడి విచారణలో నవదీప్‌ అంగీకరించారు. ఇప్పుడు మాత్రం డ్రగ్స్‌ వాడలేదని సమాధానమిస్తున్నారు. రామ్‌చంద్‌తో కలిసి నవదీప్‌ గతంలో బిపిఎం పబ్‌ నిర్వహించారు. సెల్‌ఫోన్‌లో ఉన్న డేటాను డిలీట్‌ చేశారు. నవదీప్‌ ఫక్షన్‌ రీట్రైవ్‌ చేసి మళ్లీ విచారిస్తాం. నవదీప్‌ ఫోన్‌ డేటా పూర్తిగా వచ్చిన తర్వాతే మళ్లీ విచారణ ఉంటుంది' అని ఎస్‌పి తెలిపారు.