- నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి... బస్సుల్లో ఎత్తిపడేసి...
- ఢిల్లీలో అడుగడుగునా దౌర్జన్యకాండ
- జంతర్‌మంతర్ వద్ద దీక్షా శిబిరం కూల్చివేత
- క్రీడాకారులకు మద్దతుగా వెళ్లిన రైతులు, మహిళా సంఘాల నాయకుల అరెస్ట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నూతన పార్లమెంటు భవనం ఎదుట నిరసనకు యత్నించిన రెజ్లర్లపై మోడీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గత కొన్ని వారాలుగా జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఆదివారం నూతన పార్లమెంట్ భవనానికి మార్చ్‌గా బయల్దేరారు. పెద్ద యెత్తున మోహరించిన పోలీసులు నిరసనకారులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి, వాహనాల్లో ఎత్తిపడేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్దయెత్తున నినాదాలు చేశారు. అరెస్టు చేసిన రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. రెజ్లర్ల శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల దౌర్జన్యకాండపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. . న్యాయం కోసం పోరాడుతున్న తమకు అన్యాయం చేస్తారా అంటూ నిలదీశారు.
అంతకుముందు పార్లమెంట్ భవనం వైపు సాగుతున్న నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ, తోపులాట జరిగాయి. భద్రతా వలయాన్ని ఛేదించుకొని కొత్త పార్లమెంట్ వైపు ముందుకు వెళుతున్న ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత వినేష్ పోగట్, ఆమె సోదరి సంగీతా పోగట్ సహా పలువురు రెజ్లర్లను పోలీసులు నిర్బంధించారు. వినేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు తన సోదరికి రక్షణగా సంగీత కొద్దిసేపు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. వారి చేతుల్లోని జాతీయ పతాకాలను పోలీసులు లాగి పడేసి, ఈడ్చుకెళ్లి బస్సుల్లో కుక్కారు. రెజ్లర్లకు మిగతా 5లో మద్దతుగా నిలిచిన ఐద్వా ఉపాధ్యక్షులు సుభాషిణి అలీ, జగ్మతి సాంగ్వాన్, ఢిల్లీ అధ్యక్షులు మైమూనా మొల్లా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు నేత అన్నీ రాజా, పిఎంఎస్ నేత పూనమ్ కౌశిక్, మహిళా రైతు నాయకులు చరణ్జిత్ కౌర్ ధురియన్, దేవిందర్ కౌర్ హర్దాస్పురా వందలాది మంది మహిళలతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్‌లో గూండా... పతక విజేతల ఈడ్చివేత ! నిప్పులు చెరిగిన రెజ్లర్లు
పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వినేష్ పోగట్ నిప్పులు చెరిగారు. పార్లమెంటుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వినేష్‌ను అడ్డుకొని బస్సులో తరలిస్తుండగా 'కొత్త దేశానికి అభినందనలు' అంటూ ఆమె నినదించారు. భారతీయ క్రీడల చరిత్రలో ఇది విచారకరమైన రోజని సాక్షి మాలిక్ వ్యాఖ్యానించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన గూండా బ్రిజ్ భూషణ్ పార్లమెంటులో కూర్చుంటే దేశం కోసం పతకాలు సాధించిన తమను రోడ్లపై ఈడ్చుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'మన ఛాంపియన్ల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రపంచమంతా గమనిస్తోంది. దేశానికి పతకాలు తేవడమే నేరమా? అయితే మమ్మల్ని ఉరితీయండి' అని అన్నారు. 'మేము శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తుంటే మహిళలు అని కూడా చూడకుండా ఎలా దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. న్యాయం కోసం పోరాడుతుంటే మాకు తీవ్రమైన అన్యాయం చేశారు' అని ఒలింపియన్ బజరంగ్ పునియా విలేకరులతో అన్నారు. రెండు వేల మంది మద్దతుదారులను పోలీసులు నిర్బంధించారని ఆయన చెప్పారు. 'ఏ ప్రభుత్వమైనా దేశ ఛాంపియన్లను ఇలా చూస్తుందా? మేము ఏం నేరం చేశాం?' అని ప్రశ్నించారు.
పోలీసులు చెదరగొడుతుండగా సాక్షి మాలిక్ భర్త, రెజ్లర్ సత్యవ్రత్ కడియన్, మరో రెజ్లర్ జితేందర్ కిన్హాలు 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రెజ్లర్లను అరెస్ట్ చేసి తొమ్మిది బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. బజరంగ్‌ను మయూర్ విహార్ సమీపంలోనూ, సాక్షిని బురారీలోనూ, వినేష్, సంగీతలను కల్కాజీలోనూ పోలీస్ స్టేషన్లలో ఉంచారు. కొందరు ఆందోళనకారులను తిక్రీ సరిహద్దు వైపుకు తరలించారని తెలిసింది. రెజ్లర్ల శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, హోర్డింగులు, టార్పాలిన్ పట్టాలు, వెదురు కర్రలు, తాళ్లు, ఇతర సామగ్రి, రెజ్లర్లు ఉపయోగించిన మంచాలు, పరుపులను సైతం పోలీసులు తొలగించారు. ఆ ప్రదేశాన్ని మొత్తం ఖాళీ చేయించారు.
సరిహద్దుల్లో నిలిపివేత.. వేలాదిమంది అరెస్టు
సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో సహా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ వచ్చిన వారిని ఢిల్లీలో ప్రవేశించకుండా సరిహద్దులను మూసివేశారు. రోహ్తక్, హిసార్, భివానీ, జింద్, ఫతేహాబాద్, సంప్లా, పల్వాల్, గుర్గావ్, ఇతర ప్రాంతాల్లో వేలాది మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన మహిళలు, రైతులను నర్వానా సమీపంలోని పంజాబ్, హర్యానా సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. దీంతో, రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. అంబాలా నగరంలోని గురుద్వారా మంజీ సాహిబ్ వద్ద వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. చాలా మంది రైతులను సింఘు సరిహద్దు దగ్గర అదుపులోకి తీసుకుని సోనేపట్‌లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. టిక్రీ సరిహద్దుకు పాదయాత్ర చేస్తున్న సుమారు వెయ్యి మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌కెఎం నాయకుడు రాకేష్ తికాయత్ సహా రెండు వేల మంది రైతులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ వారిని అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల వద్ద కూడా రైతులను నిర్బంధించారు. ఎఐకెఎస్ కార్యకర్తలు, రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు.
పోరాటం కొనసాగుతుంది: రెజ్లర్లు
పోలీసుల చర్యతో ఉద్యమం ముగియదని, జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహం కొనసాగుతుందని, భారత్ నిరంకుశ దేశం కాదని సాక్షి మాలిక్ పేర్కొన్నారు. రైతు సంఘాలు, ఖాప్ నేతలు త్వరలో సమ్మెను ప్రకటించనున్నారు.
మోడీ ప్రభుత్వ చర్య సిగ్గుచేటు: సిపిఎం
రెజ్లర్లు, ఐద్వా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని సిపిఐ(ఎం) వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం అంటే గొప్ప భవనాలు, ఆడంబర ప్రసంగాలు కాదని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, స్వేచ్ఛలను గౌరవించడమని సిపిఎం పేర్కొంది. మోడీ ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించి ఉండవచ్చని, కానీ వీధుల్లో, పోలీసులతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తోందని విమర్శించింది.
ఐద్వా ఖండన
మోడీ ప్రభుత్వ అణచివేతను ఐద్వా తీవ్రంగా ఖండించింది. మహిళా సమ్మాన్ పంచాయితీకి వెళ్తున్న వారిని కొత్త పార్లమెంట్ భవనం వద్ద నిర్బంధించడం కేంద్రం నిరంకుశత్వాన్ని వెల్లడిస్తోందని పేర్కొంది. రెజ్లర్లు, కార్యకర్తలందరికీ ఐద్వా సంఘీభావంగా నిలుస్తుందని తెలిపింది.
ప్రజాస్వామ్యానికి దుర్దినం : ఎస్‌కెఎం
న్యాయం చేయాలని కోరిన ప్రముఖ రెజ్లర్లను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే దుర్దినమని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పేర్కొంది. రెజ్లర్లు, రైతులు, మహిళలపై పాశవిక దాడిని ఎస్ కెఎం ఖండించింది. ప్రజాస్వామ్య నిరసనల అణచివేతను ఆపాలని, అరెస్టు చేసిన నిరసనకారులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి శిక్షించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌కెఎం హెచ్చరించింది.
రెజ్లర్లకు 1,150 మందికిపైగా ప్రముఖులు మద్దతు
గత 36 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు దేశంలోని ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ మేరకు 1,150కిపైగా మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, మాజీ సివిల్ సర్వీస్ అధికారులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు తదితరులు మద్దతు తెలిపారు. వెంటనే బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన రెజ్లర్లను, మహిళా సంఘాల నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.










