ప్రజాశక్తి - యంత్రాంగం : హరిత విప్లవ పితామహుడు, పద్మవిభూషణ్ ఎంఎస్ స్వామినాథన్ లేని లోటు పూడ్చలేనిదని గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సహా పలువురు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తమ సానుభూతిని తెలియజేశారు. స్వామినాథన్ మృతి పట్ల గవర్నరు విచారం వ్యక్తం చేశారు.
మహోన్నత వ్యక్తి స్వామినాథన్ - ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
దేశంలో ఆహారోత్పత్తిని పటిష్టం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసిన మహోన్నతుడు ఎంఎస్ స్వామినాథన్. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన స్మృతి చిరస్థాయిగా నిలిచింది.
స్వామినాథన్ మృతి కలచి వేసింది - టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్
రైతు బాంధవుడు. ఆయన మృతి ఎంతగానో కలచి వేసింది. ప్రపంచంలో పేదరికం, ఆకలి తగ్గించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమించారు. వ్యవసాయ రంగంపై చెరగని ముద్ర వేశారు.
సిఫార్సులు నేటికీ అనుసరణీయం - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
స్వామినాథన్ సిఫార్సులు అత్యంత విలువైనవి. నేటికీ అనుసరణీయమైనవి. ఆయన చేసిన కృషికి దేశ, విదేశాల్లో అనేక అవార్డులు పొందారు. ఆయన మృతి రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి తీరని లోటు. మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తుంది.
వ్యవసాయ రంగానికి తీరని లోటు - జనసేన అధినేత పవన్‌కల్యాణ్
వ్యవసాయ రంగానికి తీరని లోటు. రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో పరిశోధనలు చేయడమే కాకుండా వాతావరణ మార్పులపై అధ్యయనాలు చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మడ అడవులను సంరక్షించడంలో కృషి చేశారు.
రైతాంగ ఆత్మహత్యల నివారణకు అనేక సూచనలు - సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, నరసింగరావు
రైతాంగ ఆత్మహత్యలను నివారించడానికి అనేక విలువైన సూచనలు చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి బయటపడటానికి స్వామినాథన్ సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నాం.
వ్యవసాయ రంగం అభివృద్ధికి జీవితం అంకితం చేశారు - జెవివి రాష్ట్ర అధ్యక్షులు గేయానంద్, ప్రధాన కార్యదర్శి రామారావు
భారత వ్యవసాయ రంగం అభివృద్ధి కోసమే జీవితం అంకితం చేశారు. వ్యవసాయ రంగం క్రమేణా కార్పొరేట్ రంగం వశం అవుతున్న నేటి సందర్భంలో స్వామినాథన్ కృషికి, సిఫార్సులకు మరింత ప్రాసంగికత ఉంది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
పాటూరు రామయ్య సంతాపం
ఎంఎస్ స్వామినాథన్‌తో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.
పరిశోధనలకు మార్గదర్శి - బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి
వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ఆయనో మార్గదర్శి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.










