Oct 04,2023 21:40

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి:సిఐటియు సీనియర్‌ నాయకులు నారు కృష్ణయ్య (76) బుధవారం తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనార్యోగంతో ఆయన బాధపడుతున్నారు. కృష్ణయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విడవలూరు మండలం చౌకచర్ల ఆయన స్వగ్రామం. సుదీర్ఘంగా సిపిఎం, సిఐటియులో వివిధ బాధ్యతలలో పనిచేశారు. స్పిన్నింగ్‌ మిల్లులో కార్మికునిగా పనిచేస్తూ సిఐటియులోకి వచ్చారు. అక్కడ యూనియన్‌ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. లారీ వర్కర్స్‌ యూనియన్‌తోపాటు, సిఐటియులో అనేక సంఘాల బాధ్యతలు నిర్వహించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. కృష్ణయ్య మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పూర్వ కార్యదర్శి పి.మధు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టివివి ప్రసాద్‌, కె.అజరుకుమార్‌ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గురువారం మధ్యాహ్నం నెల్లూరు బాలాజీ నగర్‌లోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర జరగనుందని కుటుంబ సభ్యులు తెలిపారు.