- లోకేష్ అరెస్టయితే నిర్వహించాలని టిడిపి ఆలోచన
- నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నారా బ్రాహ్మణితో కొనసాగించాలని టిడిపి ఆలోచిస్తోంది. జనవరి 27న చిత్తూరులో ప్రారంభమైన లోకేష్ యాత్ర టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో ఈ నెల 9న నిలిచిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితం వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తీర్పు వచ్చే వరకు లోకేష్ ఢిల్లీలోనే ఉంటారని టిడిపి నేతలు చెబుతున్నారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టమవుతుందని, కావున పాదయాత్రను వాయిదా వేసుకోవాలని టిడిపి నేతలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా పడింది. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌ను ఎపి సిఐడి 14వ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. లోకేష్‌ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ అరెస్టయినా బ్రాహ్మణితో యాత్ర నిర్వహించాలని టిడిపి నేతలు ఆలోచన చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో అచ్చెన్నాయుడు, చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఈ నెల 25న ములాఖత్ అయిన విషయం తెలిసిందే. లోకేష్ అరెస్టు జరిగితే బ్రాహ్మణితో యాత్ర నిర్వహించాలని ఈ ములాఖత్‌లో చర్చ జరిగినట్లు సమాచారం. చంద్రబాబు జైలు నుంచి రావడం ఆలస్యమైతే భువనేశ్వరితోనూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు.
త్వరలో యాత్ర తేదీ ప్రకటిస్తాం : అచ్చెన్నాయుడు
లోకేష్ యువగళం పాదయాత్రను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. పున:ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని లోకేష్‌ను ముఖ్యనేతలు కోరారని వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క ఆధారం చూపలేని ప్రభుత్వం ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ అక్రమాలంటూ అసత్య ఆరోపణలతో బురద జల్లుతుందన్నారు. వీటన్నిటినీ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో పాదయాత్ర వాయిదా వేశామన్నారు.
రింగ్‌రోడ్డు ఎక్కడుందో చూపించగలరా? : టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి
అమరావతిలో ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎక్కడుందో ప్రజలకు చూపించాలని మాజీ మంత్రి పేర్ని నానికి టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ విసిరారు. ఒక్క ఎకరం సేకరించకుండా, నిర్మాణమే మొదలుకాని రోడ్డు ఫలానా నాయకులు, ఫలానా సంస్థల పక్కగా వెళ్లిందని నాని పిచ్చివాగుడు వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో లేవంటున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను తాము ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. కాగ్ తాజా నివేదికలు వైసిపి ప్రభుత్వ అసమర్ధ పాలనను, జగన్ దుర్మార్గాలను ఎత్తిచూపాయని టిడిపి ఎమ్మెల్సీ పి అశోక్ బాబు విమర్శించారు. కాగ్ నివేదికలపై అసెంబ్లీలో సమాధానం కూడా చెప్పకుండా సర్కార్ తప్పించుకోవడం జగన్ భయానికి నిదర్శనమని పేర్కొన్నారు. జిపిఎస్ అమలుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. జిపిఎస్ బిల్లులో ప్రవర్తన అనే మాటకు అర్థం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం గిరిజనులకు ఏం చేసిందో చెప్పాలని టిడిపి ఎస్‌టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాయక్ ప్రశ్నించారు. గిరిజనులకు జరుగుతున్న ద్రోహంపై మాట్లాడుతుండటంతో తనపై అక్రమ కేసులు పెట్టి, కక్షసాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.










