Jan 28,2023 14:48

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్యజిల్లా) : మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీ నారాయణరాజుపేట జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరుకు సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ, హౌసింగ్‌ డిఇ మురళి లు పూజలు నిర్వహించి శనివారం ప్రారంభించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులతో ఈ బోరు మోటర్‌ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ తెలిపారు. ఇల్లు నిర్మించుకుంటున్న వారికి అనువుగా నీటి వసతులు కల్పించడం కోసం ఈ బోర్‌ ఏర్పాటు చేయడం జరిగిందని కాలనీలోని అన్ని ప్రాంతాలకు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నారాయణరాజుపేట జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, హౌసింగ్‌ సిబ్బంది, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.