Oct 04,2023 10:21

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని, రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు వృథా కావని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు పెద్దఎత్తున రాజమహేంద్రవరం తరలివచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. రాజధాని విధ్వంసం కంటే చంద్రబాబును జైల్లో పెట్టిన ఘటనే తమకు ఎక్కువ బాధ కలిగించిందని వాపోయారు. అమరావతి నుంచి రాజమహేంద్రవరం వస్తున్న తమను వీరవల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళనా చేసినా కనికరించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయానికి వెళ్తున్నామని చెప్పిన తర్వాతే తమను అనుమతించారని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం నాటి నుంచి తమను ప్రభుత్వం వేధిస్తూనే ఉందన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే తమ భూములు రాజధానికి ఇచ్చామని రైతులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాల గురించి చంద్రబాబు ఎప్పుడూ తనతో చెబుతుండేవారన్నారు. మూడు రాజధాను లు అంటూ వైసిపి ప్రభుత్వం రాజధానే లేకుండా చేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.