- సిబ్బంది, గదులు లేకుండానే కొత్త కళాశాలలు
-ఇంకా చేరని పాఠ్య పుస్తకాలు
- నేటి నుంచి తరగతులు ప్రారంభం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంటర్ విద్యలో గందరగోళం నెలకొంది. తరగతి గదులు, బోధనా సిబ్బంది లేకుండానే ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్య తీసుకురానుంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. జూనియర్ కళాశాలల్లో ఇంటర్ తరగతులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరం కేలండరును ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. ఏప్రిల్ 21వ తేదీ చివరి పనిదినంగా పేర్కొన్న బోర్డు 220 రోజులు కళాశాలలు జరుగుతాయని తెలిపింది. అయితే ఇప్పటి వరకు కళాశాలలకు పాఠ్య పుస్తకాలు చేరలేదు. దీంతో విద్యార్థులు ఒట్టి చేతులతోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరం నుంచి సుమారు 220 ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలలుగా ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కళాశాలలకు కల్పించాల్సిన బోధన సిబ్బందిని, అదనపు తరగతి గదులను, ఇతర సౌకర్యాలను మాత్రం పట్టించుకోలేదు. అప్‌గ్రేడ్ చేసిన ఈ 220 స్కూళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్ల ద్వారా కరపత్రాలు ముద్రించి ప్రచారం కూడా చేసింది. సిబ్బంది, కావాల్సిన తరగతి గదులు లేకుండానే అడ్మిషన్లు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి చేసింది. వసతులు కల్పించకుండా విద్యార్థులు ఎలా చేరతారని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైస్కూల్స్‌లో పిజి అర్హతతో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఎ)కు ఉద్యోగోన్నతి కల్పించి జూనియర్ కళాశాలల్లో బోధన చెప్పిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఉద్యోగోన్నతుల అంశం మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యాశాఖలో ప్రస్తుతం రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయితేనే ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులు జరుగుతాయి. అప్పటి వరకు కొత్త కళాశాలలు ప్రారంభమవ్వకుండా విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క ఇప్పటికే మంజూరైన 85 జూనియర్ కళాశాలల్లో పోస్టులను మంజూరు చేయలేదు. ఇందుకు సంబంధించిన ఫైల్ ఏళ్ల తరబడి నుంచి ఆర్థికశాఖ వద్ద పెండింగులో ఉంది.
జిఓ 85తో కొత్త చిక్కులు
మండలానికి ఒక జూనియర్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ 85తో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పటికే నడుస్తున్న కోాఎడ్యుకేషన్ కళాశాలలో బాలురు విభాగాలను మూసివేసింది. వీటిని మహిళా కళాశాలలుగా మార్చడంతో అప్పటి వరకు చదువుకున్న బాలురు ఏ కళాశాలకు వెళ్లాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉదాహరణ విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ కోాఎడ్యుకేషన్ కళాశాలను బాలికలకు మార్చేసి, పాయకపురంలో ఉన్న కళాశాలను కోాఎడ్యుకేషన్‌గా మార్చారు. రాజమండ్రి నగరంలో ఉన్న కళాశాలను బాలికలకు మార్చడంతో బాలురు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవలేశ్వరం కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరమున్నచోట బాలికల కోసం అదనంగా మరో కళాశాల ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం గందరగోళ నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోంది.










