Oct 04,2023 20:53

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ :తమను విధుల్లోకి తీసుకోవాలని తీసుకోవాలని, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, వీక్లీ ఆఫ్‌లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ క్లాప్‌ డ్రైవర్లు బుధవారం అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నియంతృత్వ వైఖరి విడనాడాలని, బకాయి వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఆనంద్‌ బాబు, ఆవాజ్‌ నగర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండి.షరీఫ్‌, సిఐటియు న్యూ సిటీ నగర ప్రధాన కార్యదర్శి నరసింహులు, సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్‌ దేశాయి, మారెళ్ల విజరు, ఆటో యూనియన్‌ నగర ప్రధాన కార్యదర్శి మహమూద్‌ మాట్లాడారు. క్లాప్‌ డ్రైవర్లకు మూడు నెలల నుండి పది నెలల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జీతాలు అడిగిన వారిని కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ అక్రమంగా తొలగింపునకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి ఏజెన్సీ కార్మికుల జీతాల నుండి ఇఎస్‌ఐ, పిఎఫ్‌ కట్‌ చేస్తుందే తప్ప వారి అకౌంట్లో జమ చేయడంలేదన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ లేకపోవడంతో అనారోగ్యానికి గురైన కార్మికులకు సరైన వైద్యం చేయడం లేదన్నారు. వైద్యం అందక ఇద్దరు కార్మికులు మరణించారని తెలిపారు. వారి కుటుంబాలకు ఎటువంటి నష్టపరిహారమూ రెడ్డి ఏజెన్సీ ఇవ్వలేదని గుర్తు చేశారు. రఘు, చరణ్‌ తేజ అనే క్లాప్‌ డ్రైవర్లు ఎటువంటి తప్పు చేయకపోయినా ఉద్దేశపూర్వకంగానే వారిని విధుల నుంచి తొలగించారన్నారు. జీతాలు అడిగిన కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా తొలగించిన క్లాప్‌ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు రామకృష్ణ, కుమార్‌, క్లాప్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.