Oct 08,2023 21:43

సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్‌
ప్రజాశక్తి - గాజువాక (విశాఖపట్నం):జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన కొల్లి సత్యనారాయణ (సత్యం మాస్టార్‌) చిరస్మరణీయులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి తులసీదాస్‌ అన్నారు. గుండె సంబంధిత వ్యాధితో శనివారం కెజిహెచ్‌లో మృతిచెందిన సత్యం మాస్టారి సంతాప సభ విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తోకాడ సమైక్య అపార్టుమెంట్‌ ఆవరణలో ఆదివారం జరిగింది. తొలుత సత్యం మాస్టారి పార్థివ దేహం వద్ద పలువురు నివాళి అర్పించారు. ఆయన పార్థివ దేహంపై తులసీదాస్‌, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ఎర్రజెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో తులసీదాస్‌ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన సత్యం మాస్టారు అనంతర కాలంలో శ్రీకాకుళం వచ్చి అక్కడి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారని తెలిపారు. పోరాటాల్లో తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్నారని, జైలులో నిర్బంధించబడ్డారని చెప్పారు. నిరంతర అధ్యయనశీలి అని, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సత్యం మాస్టారుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా ఆదరించే గుణం సత్యం మాస్టారు సొంతమన్నారు. ఆయన భార్య సరోజిని అంతే ఓపిగ్గా ప్రతి కార్యకర్తనూ ఆప్యాయంగా చూసుకునేవారని తెలిపారు. వారి కుటుంబం ఆదర్శవంతమైందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలకు అవసరమైన ఎంతోమంది కార్యకర్తలను సత్యం మాస్టారు తయారు చేశారని గుర్తుచేశారు. డి గోవిందరావు మాట్లాడుతూ ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎత్తిన ఎర్రజెండాను సత్యం మాస్టారు దించలేదన్నారు. జిల్లాలో జరిగిన ఎన్నో పోరాటాలకు ఆయన నేతృత్వం వహించారని తెలిపారు. పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ సత్యం మాస్టార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నివాళ్లర్పించిన వారిలో సిపిఎం శ్రీకాకుళం నాయకులు పి తేజేశ్వరరావు, కె నాగేశ్వరరావు, కె శ్రీనివాస్‌, విశాఖ జిల్లా నాయకులు ఎం రాంబాబు, ఎన్‌ రాజేంద్రప్రసాద్‌, తోకాడ సమైక్య అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ నాయకులు తౌడన్న, చిన్నంనాయుడు, సత్యం మాస్టారి కుటుంబీకులు అజేయ కుమారి, ప్రసాద్‌రాజు ఉన్నారు. సత్యం మాస్టారి అంతిమ యాత్ర సమైక్య అపార్టుమెంట్‌ నుంచి చినగంట్యాడ వందడుగుల రోడ్డులోని స్మశాన వాటిక వరకూ సాగింది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.