ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మ మరోసారి నియమితులయ్యారు. చేతన్ శర్మ 2020 డిసెంబరు నుంచి గత డిసెంబరు వరకు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు. తాజా నియామకాల్లోనూ ఆయనకు మరోసారి అవకాశం లభించింది. చేతన్ శర్మ మరో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సిఏసి) ఈ మేరకు ఖరారు చేసింది. గత సెలెక్షన్ కమిటీ కాలపరిమితి 2022 డిసెంబరుతో ముగిసింది. గత నవంబరు 18న ఐదుగురు సెలెక్టర్ల పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా, 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసిన సిఏసి తాజా నియామకాలు చేపట్టింది.










