ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : విద్యార్థులకు తరగతి గదులలో విన్న పాఠాల కంటే వారు స్వయంగా అనుభవించి తెలుసుకున్న పాఠాలు జీవితంలో ఎక్కువ శాతం ఉపయోగపడతాయన్నారు ఉపాధ్యాయిని పులి కుసుమ. ఉండ్రాజవరం మండలం కాల్దరి నంబర్ 3 పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె విద్య పట్ల, విద్యార్థుల పట్ల ఉన్న మక్కువతో విద్యార్థుల్లో విజ్ఞానార్జనకు స్వయంగా పలు రకాల బోధనోపకరణాలను తయారుచేసి, బోధిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానానికిగాను ఆమె విద్యా వ్యవస్థలో రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి రివార్డులు అందుకున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 వర్కింగ్ మోడల్ ను తయారుచేసి, విద్యార్థులకు కళ్ళకు కట్టినట్లు చూపించారు, విద్యార్థులు సైతం ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ ... మనకు ఉపయోగం లేవనుకున్న వృధా సామాగ్రి అట్ట ముక్కలు, ప్లాస్టిక్ గొట్టాలు, చిన్నపాటి బల్బులు, విద్యుత్ తీగలు తదితర సామాగ్రి ఉపయోగించి, చంద్రయాన్ 3 నమూనా బోధనోపకరణాన్ని తయారు చేసినట్లు తెలిపారు. దానిలో రిమోట్ కంట్రోల్, యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో అంతరిక్షంలో కి ప్రయోగించిన విధంగా అది పనిచేయటంతో విద్యార్థులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.










