- పొడిగించాలని పిటిషన్
-విచారణలో ఏమి గుర్తించారో బయటపెట్టాలి : చంద్రబాబు
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో, రాజమహేంద్రవరం ప్రతినిధి :స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రిమాండ్‌ను మరో 11 రోజులు అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఎసిబి కోర్టు ఆదేశించింది. ఈ నెల 9న చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఈ నెల 22వ తేదీ వరకు 14 రోజుల రిమాండ్‌ను సిబిఐ కోర్టు విధించింది. 22వ తేదీన రిమాండ్‌ను 24 వరకు పొడిగిస్తూ రెండు రోజుల సిఐడి కస్టడీకి అనుమతించింది. సిఐడి కస్టడీ, రిమాండ్ గడువు ముగియడంతో ఆదివారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండే చంద్రబాబునాయుడును విజయవాడలోని ఎసిబి కోర్టులో వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశ పెట్టగా. ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టారు. చంద్రబాబునాయుడు రిమాండ్‌ను పొడిగించాలని సిఐడి న్యాయవాది కోరగా, అక్టోబరు 5 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా సిఐడి అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? ఏమైనా అసౌకర్యం కలిగిందా? వైద్య పరీక్షలు చేయించారా? అని చంద్రబాబునాయుడిని న్యాయమూర్తి ప్రశ్నించారు. విచారణకు తాను సహకరించానని చంద్రబాబు చెప్పారు. ఈ కేసు విచారణలో ఏమి గుర్తించారో బహిర్గతం చేయాలని జడ్జిని చంద్రబాబునాయుడు కోరగా, అలా చేయడం కుదరదని, కోర్టుకు విచారణకు సంబందించిన అంశాలను సిఐడి పిటిషన్‌లో వేసినందున మీ న్యాయవాదుల ద్వారా తెలుసుకోవచ్చని జడ్జి బదులిచ్చారు. ఈ సందర్బంగా కస్టడీని పొడిగించాలని సిఐడి పిటిషన్‌ను దాఖలు చేసింది. సిఐడి కస్టడీ పిటిషన్‌పై చంద్రబాబునాయుడు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రెండో రోజు విచారణ సాగిందిలా..
చంద్రబాబు రెండు రోజుల సిఐడి కస్టడీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు మొదలై సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ప్రతి గంటకు ఐదు నిమిషాల చొప్పున బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇచ్చి రెండు గంటలకు తిరిగి విచారణ ప్రారంభించారు. రెెండో రోజు కూడా సుమారు ఆరు గంటలకుపైగా చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో సిఐడి విచారించింది. గడిచిన రెండ్రోజుల్లో సుమారు వందకుపైగా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం చంద్రబాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు విచారణను సిఐడి అధికారులు వీడియో తీయించారు. కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డిఎస్‌పి ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఐఎఎస్ అధికారుల వాంగ్మూలాలని, డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని విచారించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రధానంగా విచారణ జరిగింది. చంద్రబాబు పిఎ పెండ్యాల శ్రీనివాస్‌కు హవాలా రూపంలో రూ.118 కోట్లు అందినట్లు ఉన్న ఆరోపణలపై ప్రశ్నలు వేశారు. చంద్రబాబు 13 చోట్ల చేసిన సంతకాలపైనా అధికారులు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా రూ.371 కోట్లు నిధులు విడుదల ఎందుకు చేశారని, కిలారు రాజేష్‌కు, నారా లోకేష్‌కు మధ్య ఆర్థిక సంబంధాలపైనా ఆరా తీశారు. ఈ ప్రశ్నలకు కొన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పారు. మరికొన్నింటికి తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది. కస్టడీ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎసిబి కోర్టులో హాజరు పర్చారు. చంద్రబాబు రెండో రోజు విచారణలో భాగంగా సెంట్రల్ జైలు చుట్టుపక్కల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.










