రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు చల్లని వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం జైలు ఆవరణలో.. చంద్రబాబుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో కలిసి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ.. ''చంద్రబాబు వేసుకునే మందులు మాకు చూపించారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులు సూచించాం. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించాం. చల్లని వాతావరణం లేకపోతే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పని చేస్తాయో తెలియదు. ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు. గతంలో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో మాకు తెలియదు'' ప్రభుత్వ వైద్యులు వివరించారు.
డీఐజీ రవికిరణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి ఆరోగ్యం, భద్రత విషయంలో అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. ఆయన ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నారని, అందుకు అనుగుణంగా ఐదుగురు వైద్యులు ఆయనకు చికిత్స అందించినట్టు చెప్పారు. అన్ని విషయాలు కోర్టు దఅష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇవాళ్టి వైద్యుల నివేదికను కూడా వెంటనే కోర్టుకు పంపిస్తామన్నారు. చంద్రబాబుకు ఇస్తున్న మందులను కూడా కోర్టు దఅష్టికి తీసుకెళ్తాం.. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనకు వైద్య సేవలందిస్తామని డీఐజీ స్పష్టం చేశారు. జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవని.. ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు. నారా లోకేశ్‌తో వాగ్వాదంపై డీఐజీ స్పందిస్తూ... ఎవరితో ఎలా వ్యవహరించాలనేదానిపై ప్రొటోకాల్ ఉంటుందన్నారు. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ములాఖత్ సమయం ముగిసిందని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.










