Oct 13,2023 21:43

- తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:స్కిల్‌ స్కామ్‌ కేసులో రాజమహేంద్రరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ తెలిపారు. ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెంట్రల్‌ జైలులోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా ఎస్‌పి జగదీష్‌తో కలిసి జైళ్ల శాఖ డిఐజి రవికిరణ్‌ శుక్రవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ చంద్రబాబును మొదటి నుంచి హై ప్రొఫైల్‌ ఖైదీగానే ట్రీట్‌ చేస్తున్నామని తెలిపారు. ఆయన ఉంటున్న బ్యారక్‌ చాలా విశాలంగా ఉంటుందన్నారు. బ్యారక్‌లో ఎనిమిది ఫ్యాన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం ఎసిలు, కూలర్లు ఏర్పాటు చేయలేమని చెప్పారు. కోర్టు నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నామన్నారు. జైలులో తాగునీటికి ఎలాంటి సమస్య లేదని, జైలులో ఉన్న 2,100 మంది ఖైదీలూ అదే నీటిని తాగుతున్నారని తెలిపారు. కలుషితమై ఉంటే వారందరికీ కూడా అనారోగ్య సమస్య తలెత్తేవని చెప్పారు. చంద్రబాబుకు స్కిన్‌ సమస్య రావడంతో ప్రభుత్వ వైద్యులతో వైద్యం చేయించామని తెలిపారు. తాగునీరు, భోజన విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. జైలులోకి డ్రోన్‌ వచ్చిందనే వార్త అవాస్తవమన్నారు. జైలులో ఎటువంటి భద్రతా లోపాలూ లేవని, తమపై ఎలాంటి వత్తిళ్లూ లేవని చెప్పారు. చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబును జైలుకు తీసుకొచ్చినప్పుడు 66 కిలోలు ఉన్నారని, ప్రస్తుతం ఆయన 67 కిలోల బరువు ఉన్నారని తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే ప్రైవసీ అని అన్నారు. మాజీ మంత్రి యనమల ఏమి మాట్లాడారో తమకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. 'చంద్రబాబుకు థ్రెట్‌' అంటూ లోకేష్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అవాస్తవమని అన్నారు. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు చంద్రబాబకు ఒఆర్‌ఎస్‌ అందిస్తున్నామని తెలిపారు.