Sep 16,2023 22:36
  • స్కిల్‌ స్కామ్‌లో ఫేక్‌ అగ్రిమెంట్‌తో ఖజానా దోపిడీ
  • ఇడి తేల్చింది... ఐటి నోటీసులిచ్చింది
  • 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం' నిధుల విడుదలలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : స్కిల్‌ స్కామ్‌ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 'వైఎస్సార్‌ కాపు నేస్తం' నాలుగో విడత నిధులు 536.77 కోట్ల రూపాయలను బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్టు స్కామ్‌లో లేని కంపెనీని ఉన్నట్లుగా చూపించారన్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. ఫేక్‌ అగ్రిమెంట్‌తో ప్రభుత్వ ఖజానాకు దోపిడిచేశారన్నారు. ' నిధులు డొల్ల సూట్‌ కేసు కంపెనీలకు మళ్లించినట్లు ఇడి తేల్చింది. ఫేక్‌ అగ్రిమెంట్‌ దొంగలను ఇప్పటికే అరెస్ట్‌ చేసింది.ఐటి నోటీసులిచ్చింది. చంద్రబాబు పిఎకు కూడా ఈ నోటీసులు అందాయి' అని చెప్పారు. కోర్టు రిమాండ్‌కు పంపితే ప్రశ్నిస్తాఅని అంటున్న వారు ఈ నిజాలను ఎందుకు ప్రశ్నించరని అన్నారు. '371 కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోయింది. ఆ ధనాన్ని దోచుకున్న బాబును కాకుంటే ఇంకెవరిని అరెస్ట్‌ చేయాలి' అని ప్రశ్నించారు. ఒటు నోటు కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ నల్లధనం ఇస్తూ అడ్డంగా ఆడియో, వీడియో టేపులతో దొరికినా కూడా, ఆ వాయిస్‌ చంద్రబాబే అని తేల్చినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ అర్థమైన కూడా బాబు చేసింది నేరమే కాదని వాదించి, 10 కోట్ల మంది ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి దొంగతనాల్లో వాటాదారులు వెంటనే రెడీ అయ్యారు, అరడజన్‌ చానల్స్‌, రెండు పత్రికలు అండగా నిలిచారని అన్నారు. 'నల్ల డబ్బు ఇస్తూ దొరికినా, ఫారెన్సిక్స్‌ ల్యాబ్‌లు సర్టిఫికెట్లు ఇచ్చినా నీతి,న్యాయం, ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి. చట్టం వైపా..దొంగల వైపు నిలబడాలా? ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా..ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఎల్లోమీడియా నిజాన్ని చూపించదు, నోరెత్తదు, పైగా నిసిగ్గుగా ఆ పని సబబే అని మాట్లాడుతారని అన్నారు.

2


'వైయస్‌ఆర్‌ కాపు నేస్తం' గురించి మాట్లాడుతూ అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన నిరుపేద మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోందని సిఎం తెలిపారు.సామాజిక న్యాయాన్ని తమ ప్రభుత్వం ఒక విధానంగా మార్పుకుందని చెప్పారు. తొలుత నిడదవోలు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. నిడదవోలు సమీపంలోని సుబ్బరాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్ద ఆయనకు ప్రజా ప్రతినిధులు, అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి ఘనంగా స్వాగతం పలికారు. సిఎంకు స్వాగతం పలికిన వారిలో మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, డాక్టర్‌ తానేటి వనిత, దాడిశెట్టి రాజా డాక్టర్‌ కారుమూరి నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.