- కేంద్ర నిర్ణయం.. జమిలి ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధం
అమరావతి : దసరా నుంచే విశాఖ నుండి పరిపాలన చేస్తామని.... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని, జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసిపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బుధవారం ఎపి కేబినెట్ ముగిసింది. కేబినెట్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు సిఎం జగన్ బదులిస్తూ కీలక ప్రకటనలు చేశారు.
దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన జరగబోతుంది అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర భవనాల ఎంపిక విషయంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల తరలింపు ఉంటుందని సిఎం అన్నారు. మరోవైపు జమిలీ ఎన్నికలపై సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు వైసిపి సిద్ధంగా ఉందని సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.










