- పరమత సహనంతో జీవించాలి : కలెక్టర్ సృజన
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్ :మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా కర్నూలులో లావుబాలి దర్గా నుంచి రాజ్‌విహార్ సెంటర్ వరకూ ముస్లిములు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సృజన, ఎస్‌పి కృష్ణకాంత్, కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, మాజీ ఎంపి బుట్టా రేణుక, స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో శాంతిని నెలకొల్పాలని మహమ్మద్ ప్రవక్త ఆనాడే సూచించారని తెలిపారు. నగర ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలని, ప్రేమ ఆప్యాయతలను పంచుతూ పరమత సహనం కలిగి కలిసి మెలిసి జీవించాలని అన్నారు. సెంట్రల్ మిలాద్ కమిటీ నాయకులు సయ్యద్ షఫీ పాషా ఖాద్రీ మాట్లాడుతూ.. అహలే సున్నత్ వారి కోసం ఈద్గా కావాలని కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డుకు చెందిన 40 ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఈద్గాకు ఇచ్చేందుకు ఎస్‌పి, కలెక్టర్ సహకారం అందించాలని కోరారు. పేదల కోసం నగరంలో రూ. కోటితో పీనరల్ హోం తయారు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ మిలాద్ కమిటీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా అజ్మీర్ వెళ్లేందుకు లక్కీడిప్ ద్వారా ఐదుగురిని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి ఎంపిక చేశారు. అనంతరం దర్గా వద్ద జెండా ఆవిష్కరణ, ప్రార్థన చేసి సలాంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి చైర్మన్ ఎస్‌వి. విజయమనోహరి, ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సమీరుద్దీన్ ముజమ్మిల్, సయ్యద్ షా అబ్దుల్లా ఖాద్రీ, వివిధ దర్గాల పీఠాధిపతులు, ముస్లిం పెద్దలు, కార్పొరేటర్లు పాల్గన్నారు.పలు జిల్లాల్లో వేడుకలు నిర్వహించారు.










