Sep 13,2023 15:56

హైదరాబాద్‌ : ఆర్టీసీలోని అన్ని రకాల బస్సుల్లో త్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు రానుంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపై స్థాయి బస్సులన్నింటిలోనూ ఐ-టిమ్స్‌ పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. దీంతో డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో పాటు గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి వాటితో ప్రయాణికులు తమ టికెట్‌ ధరను చెల్లించి, బస్సుల్లో ప్రయాణించొచ్చు.ఈ మేరకు బండ్లగూడ బస్‌డిపోను ఆర్టీసీ అధికారులు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బండ్లగూడ డిపోలో అమలు చేసిన అనంతరం కంటోన్మెంట్‌ డిపోలో అమలు చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశల వారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.