(జూబ్లీహిల్స్) హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు ఎర్రంరెడ్డి సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడుతోపాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో తనపై దాడిచేసి, ఇబ్బంది పెట్టిన తన మామ సూరీడు, ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ... సూరీడి అల్లుడు సురేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు గత మంగళవారం వారిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... సూరీడి కుమార్తెను కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్ రెడ్డికి ఇచ్చి గతంలో వివాహం చేశారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో సూరీడి కుమార్తె తన భర్తపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు. 2021 మార్చి 23న రాత్రి 7.30 గంటలకు సురేందర్‌రెడ్డి క్రికెట్ ఆడిన తర్వాత కుమార్తెను చూడటానికి జూబ్లీహిల్స్‌లోని తన మామ ఇంటికి వెళ్లారు. అక్కడ మామా అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో అల్లుడిపై సూరీడు దాడిచేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సురేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని, ఆయన చేతిలోని క్రికెట్ బ్యాట్‌ను, బైక్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐజీగా పనిచేస్తున్న జి.పాలరాజుతో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తనను అక్రమంగా కస్టడీలోకి తీసుకొని, తనపై తప్పుడు కేసులు పెట్టిన సూర్యనారాయణరెడ్డి (సూరీడు), రాజశేఖర్‌రెడ్డి, నరేష్, పాలరాజులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ... గత మంగళవారం సురేందర్‌రెడ్డి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దఅష్టికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలంటూ బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ సుబ్బయ్య నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










