షెడ్యూల్ ప్రకారమే వన్డే ప్రపంచకప్
దుబాయ్: షెడ్యూల్ ప్రకారమే వన్డే ప్రపంచకప్ జరుగుతుందని, వేదికల మార్పు కుదురని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి), భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) తాజాగా ప్రకటించాయి. పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు(పిసిబి) ప్రధానంగా రెండు మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ ఐసిసికి లేఖ రాసింది. ఈ క్రమంలో గురువారం ఐసిసి, బిసిసిఐ సంయుక్తంగా ఓ ప్రకటనలో వేదికల మార్పు కుదురదంటూ, షెడ్యూల్ ప్రకారమే వన్డే ప్రపంచకప్ జరుగుతుందంటూ పిసిబికి స్పష్టం చేశాయి. పాక్ బోర్డు ఆస్ట్రేలియాతో బెంగళూరులో, ఆఫ్ఘనిస్తాన్‌తో చెన్నైలో జరిగే రెండు మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ ఐసిసిని కోరింది. ఇక వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ డ్రాఫ్ట్‌ను బిసిసిఐ సిద్ధం చేసి దానిని ఐసిసికి పంపింది. దీనిపై అభిప్రాయాలు ఏమైనా ఉంటే తెలపాలంటూ ఐసిసి సభ్య దేశాలను కోరింది. ఈ క్రమంలో పిసిబి చెన్నైలోని చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలమని, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామమని ఈ రెండు వేదికలను మార్చాలంటూ పాక్ అసంతఅప్తిగా వ్యక్తం చేసింది. ఈ విషయంపై బిసిసిఐ, ఐసిసి సమావేశమై చర్చించాయి. నిబంధనల ప్రకారం చూసుకుంటే వేదికలు నిర్ణయించే హక్కు ఆతిథ్య దేశానికి ఉంటుంది. వేదికలు మార్చాలంటే ఐసిసి ఆమోదం తప్పనిసరి. అయితే ఐసిసి సరైన కారణం లేకుండా వేదికలు మార్చడానికి అంగీకరించదు. ఏవైనా భద్రతా కారణాలు ఉంటేనే వేదికలు మార్చాలంటుంది. మరే ఇతర కారణాలకూ దాదాపు మార్చరు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వద్ద సరైన కారణం ఏదీ లేదని, అలాంటప్పుడు వేదికలు మార్చడం కుదరదని ఐసిసి పేర్కొంది. ఇదే విషయాన్ని పిసిబికి కూడా అధికారికంగా తెలియజేసింది. అలాగే భారత్-పాక్ జట్లమధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కూ లైన్ క్లియరైంది. ఆ మ్యాచ్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఐసిసి తాజాగా ప్రకటించింది. అలాగా వేదిక మార్చాలనే పాకిస్తాన్ అభ్యర్ధనను ఐసిసి కొట్టిపారేసింది. ఈ మ్యాచుల వేదికలు మార్చడానికి సరైన కారణం ఒక్కటి కూడా కనిపించడం లేదని ఐసిసి తెలిపింది. సరైన కారణం ఉంటే వేదికను మార్చడం కష్టమేమీ కాదు. గతంలో 2016 టి20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వేదికను భద్రతా కారణాల దృష్ట్యా మార్చారు. ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను కోల్‌కత్తాకు మార్చామని ఐసిసి ఆ ప్రకటనలో తెలిపింది.










