Feb 01,2023 20:58

క్రెడిట్‌ సూస్సె షాకింగ్‌ నిర్ణయం
కొనసాగిన షేర్ల పతనం
కుబేరుల అగ్ర స్థానంలోకి మళ్లీ ముకేష్‌

న్యూఢిల్లీ : అదానీ గ్రూపునకు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. గౌతం అదానీ కంపెనీల బాండ్లపై మార్జిన్‌ రుణాల జారీని నిలిపివేస్తున్నట్లు స్విస్‌కు చెందిన ప్రయివేటు రంగ రుణదాత క్రెడిట్‌ సూస్సె తాజాగా ప్రకటించింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నుంచి తీవ్ర మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ కంపెనీలకు ఇది మరింత శరఘాతంగా మారింది. ఈ రెండు సంస్థల దెబ్బకు బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లు పేక ముక్కల్లా కూలాయి. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్‌ కంపెనీల బాండ్లకు సున్నా విలువను ఇస్తూ క్రెడిట్‌ సూస్సె నిర్ణయం తీసుకుందని.. ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వ్యక్తులు వెల్లడించినట్లు రిపోర్టులు వచ్చాయి. ఇంతక్రితం అదానీ పోర్ట్స్‌ బాండ్లపై 75 శాతం రుణాలు ఇచ్చేవి.
ఇతర బ్యాంక్‌లు కూడా అదానీకి రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని సమాచారం. అదానీ కంపెనీలకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌లు రావొచ్చని బ్యాంక్‌లు ఆందోళన చెందుతున్నాయని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఒక్కరు తెలిపారు. ఆసియాలోని సంపన్న క్లయింట్లు పెట్టుబడులు పెట్టడానికి సెక్యూరిటీలపై తరచుగా రుణాలు తీసుకుంటారు. బ్యాంకులు సాధారణంగా సెక్యూరిటీ ధర యొక్క అస్థిరతను, రుణ విలువలను నిర్ణయించేటప్పుడు దాని క్రెడిట్‌ రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. అదానీ పరపతికి ఒక వేళ రేటింగ్‌ ఎజెన్సీలు కోత పెడితే ఆ కంపెనీలు మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో అదానీ సంపద, ఆయన కంపెనీల విలువ అమాంతం పడిపోతున్న నేపథ్యంలో రేటింగ్‌ ఎజెన్సీలు ఎలాంటి ప్రకటన చేయనున్నాయే వేచి చూడాలి. పలు కంపెనీల కుంభకోణాలు, మోసాల దెబ్బతో 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో క్రెడిట్‌ సూస్సె 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాలు చవి చూసింది. ఈ క్రమంలో హిండెన్‌బర్గ్‌ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు కంపెనీలకు సూస్సె రుణాలు జారీ చేయడానికి నిరాకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 35% పతనం..!
హిండెన్‌బర్ట్‌ రిపోర్ట్‌కు తోడు తాజాగా క్రెడిట్‌ సూస్సె అదానీ కంపెనీల బాండ్లకు సున్నా విలువను ఇవ్వడంతో బుధవారం అదానీ గ్రూపు షేర్లు కుప్పకూలాయి. తీవ్ర విమర్శల వేళ కూడా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పిఒ) ద్వారా రూ.20వేల కోట్లు సమకూర్చుకున్నప్పటికీ.. ఆ సంతోషం ఒక్క పూట నిలువలేకపోయింది. తాజా ఒక్క సెషన్‌లోనే అదానీ ఎంటర్‌ప్రైజెష్‌ షేర్‌ బిఎస్‌ఇలో ఏకంగా 28.45 శాతం లేదా రూ.846 పతనమై రూ.2,128.70కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 34.72 శాతం క్షీణించి రూ.1,942 కనిష్ట పతనాన్ని చవి చూసింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక్క పూటలోనే బిఎస్‌ఇలో 9.67 లక్షల షేర్లు చేతులు మారాయి.


అదానీ కంపెనీ పతనం ముగింపు
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 28.45% రూ.2,128
అదానీ పోర్ట్స్‌ 19.69% రూ.492
అంబూజా సిమెంట్స్‌ 16.56% రూ.335
అదానీ టోటల్‌ గ్యాస్‌ 10% రూ.1,901
అదానీ విల్మర్‌ 4.99% రూ.443
ఎసిసి సిమెంట్స్‌ 6.34% రూ.1,844
ఎన్‌డిటివి 5% రూ.235

కుబేరుల్లో 15వ స్థానానికి పతనం
హిండెన్‌బర్గ్‌ రిపోర్టు ప్రభావంతో ఒక్క వారంలోనే గౌతం అదానీ సంపద రూ.3.6 లక్షల కోట్లు (44 బిలియన్‌ డాలర్లు) తుడుచుకుపెట్టుకుపోయిందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. అదానీ సంపద 72 బిలియన్‌ డాలర్లకు పడిపోగా.. ముకేష్‌ అంబానీ సంపద 81 బిలియన్‌ డాలర్లతో భారత కుబేరుల్లో అగ్రస్థానంలోకి వచ్చారు. దీంతో గౌతం అదానీ ఇప్పటి వరకు ఉన్న ఆసియా టాప్‌-1 కుబేరుడి హోదాను కోల్పోయారు. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అదానీ హిండెన్‌బర్గ్‌ రిపోర్టుతో క్రమంగా పడిపోతూ.. తాజాగా 15వ స్థానానికి పరిమితం అయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల వేళ వచ్చే కొన్ని సెషన్లలోనూ అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.