- 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు, జమిలి, పార్టీ బలోపేతంపై చర్చ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ఫోరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి టిపిసిసి సర్వం సిద్ధం చేసింది.18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశానికి భారీ ఏర్పాట్లు చేసింది. 2005లో ఉమ్మడి రాష్ట్రంలో ఎఐసిసి ప్లీనరీ, సిడబ్య్లుసి సమావేశం జరిగింది. అంతకు ముందు 1995లో తిరుపతిలో సిడబ్య్లుసి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ వేదికగా నిలిచింది. శుక్ర, శనివారం రెండు రోజులపాటు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో సిడబ్య్లుసి సమావేశం జరగనుంది. దేశం నలుమూలల నుంచి 90 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. విస్తృత సమావేశానికి పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నేతలు, కాంగ్రెస్ పాలిత ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుకానున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇండియా కూటమి బలోపేతం, పెరుగుతున్న మతోన్మాదం, జమిలి ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మేథోమథనం చేయనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీ పేరుపై ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
సిడబ్ల్యుసి సమావేశంలో ఆ తీర్మానాన్ని చేసి ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించనున్నట్టు సమచారం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, అధ్యక్షులు, మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, తదితరులు శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానున్నారు. ఆదివారం తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరి సభను స్థానిక నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు ప్రసంగించనున్నారు. ఈ సభలో సోనియగాంధీ ఆరు హామీలను ప్రకటించనున్నారు. అందులో కర్ణాటక తరహాలో గృహాలక్ష్మి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అసైన్డ్ భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించడం, యువత, రైతులకు ప్రత్యేక భరోసా కల్పించనున్నారు.










