Sep 26,2023 15:16

అమరావతి: రాష్ట్రంలో నిరసనల మాట వింటే సీఎం జగన్‌ ఉలిక్కిపడుతున్నారని.. జనం రోడ్డెక్కితే ఆయన జడుసుకుంటున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సీఎం అణచివేస్తున్నారని.. దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.చంద్రబాబు అరెస్టుపై తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్‌ పిరికితనాన్ని చాటుతోందని లోకేశ్‌ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్‌వాడీలను పోలీసుల నిర్బంధించడం నిర్ఘాంతపరిచిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన అంగన్వాడీకి చెందిన మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్థం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, టిడిపి నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. అతి త్వరలోనే వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతారని పేర్కొన్నారు.