Sep 17,2023 14:51

వనపర్తి : సుభిక్ష తెలంగాణ ఆవిష్కరణే సీఎం కేసీఆర్‌ లక్ష్యం, పాలమూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.కృష్ణా నీటిని ఒడిసిపట్టి పాలమూరు బీళ్లలో పారించాలన్న రైతుల కలలు నెరవేరుతున్న సందర్భంగా నార్లాపూర్‌ నుంచి కృష్ణా నీళ్లతో నింపి తీసుకువచ్చిన కలశంతో ఊరేగింపుగా వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని అభిషేకించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చిత్రపటంలో ఆకుపచ్చ తెలంగాణ శాశ్వత చిరునామాగా నిలుస్తుందన్నారు. ఒకనాడు వెయ్యి అడుగులలోతు బోరు వేస్తే తాగునీటి కోసం కటకటలాడిన పరిస్థితి. నేడు 300 అడుగుల భూగర్భంలో 60, 70 కిలోమీటర్ల సొరంగాలలో కృష్ణమ్మ ప్రవాహం ఒక మహాద్భుత జలదృశ్యం, అరుదైన సందర్భమని ప్రశంసించారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. నేడు, రేపు గ్రామగ్రామాన దేవుళ్లకు కఅష్ణానీటితో అభిషేకాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పలుస రమేష్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, నియోజకవర్గ సమన్వయకర్త వంగూరు ప్రమోద్‌ రెడ్డి, రీజినల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.