ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో వుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం తగదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. డిసెంబరు నుంచి విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వుంటుందని తాను ఇక్కడే వుంటానంటూ సిఎం జగన్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిఎంకు కోర్టులంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిఎం వ్యక్తిగత నివాసాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం వుందని, అయితే రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో వుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులున్న రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.










