ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రిమాండ్‌లో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎపి సిఐడి ఈ కేవియట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని రూ.కోట్లు కుంభకోణం చేశారని, ఈ కేసులో తమ వాదనలు వినాలని పిటిషన్‌లో పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో విచారణ చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జిఎస్‌టి కౌన్సిల్ ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపింది.










