Sep 23,2023 09:28

ప్రజాశక్తి-కారంచేడు (బాపట్ల) : కారంచేడు మండలంలోని జరుబులవారిపాలెం గ్రామ శివారు ఇంకొల్లులోని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన బస్సు పంట కాలవలోకి దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జరిగింది.

గ్రామస్తుల వివరాల మేరకు ... ఇంకొల్లులోని ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందిన బస్సు ప్రతిరోజు ఉదయం పూసపాడు నుంచి బయలుదేరి తిమిడితపాడు, కేశవరపాడు, జరుబులవారిపాలెం మీదుగా ఇంకొల్లుకు చేరుతుంది. అయితే శనివారం పరిమితికి మించిన విద్యార్థులు ఆ బస్సులో ఉండటం వలన అదనపులోడు ఎక్కువవ్వడంతో బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. గత కొన్ని రోజులుగా విద్యార్థులను తీసుకువెళ్లే వాహనము చెడిపోవడం వలన ఒకే బస్సులో విద్యార్థులందరినీ పంపించడం ప్రారంభించారు దీంతో బస్సు సీట్లలో కూర్చునే విద్యార్థుల కంటే నిలుచొని ప్రయాణం చేసే విద్యార్థులే ఎక్కువ అయిపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో 20 మందికి పైగా విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తుంది. బస్సు పంట కాలువలోకి దూసుకుపోవటం వలన విద్యార్థులంతా ఒకసారిగా ఒకరిపైఒకరు పడిపోవడంతో పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. ఒక విద్యార్థికి డ్రైవర్‌ పక్క ఉన్న గేర్‌ రాడ్‌ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, మరో విద్యార్థికి బస్సు అద్దం పగిలి కంటికి తగిలినట్లుగా స్థానికులు తెలిపారు. వీరంతా హడావుడిగా తమ పిల్లలను వివిధ ప్రైవేటు వైద్యశాలకు తరలించుకుంటున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.