Oct 17,2023 21:40

ప్రజాశక్తిా-మడకశిర (సత్యసాయి జిల్లా):వైద్యులు నిర్దయగా వ్యవహరించడంతో కుమారుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై తరలించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించి బాలుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం హనుమంతనపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ, పాతలింగప్ప ఒక్కగానొక్క కుమారుడు రుషి (5) గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మంగళవారం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆస్పత్రి అంబులెన్స్‌ ఇవ్వడానికి కుంటిసాకులతో వైద్యులు నిరాకరించారు. ప్రయివేటు వాహనదారులు రూ.5 వేల వరకూ అడిగే అవకాశం ఉందని తెలుసుకున్న ఆ కూలీ దంపతులు అంత మొత్తాన్ని వెచ్చించలేక తమ కుమారుడి మృతదేహాన్ని వారు వచ్చిన ద్విచక్ర వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లారు. దాదాపు 30 కిలోమీటర్లు తల్లి ఏడుస్తూ కుమారుడిని మృతదేహాన్ని మోయగా, తండ్రి వాహనాన్ని నడిపారు. ఈ దృశ్యం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది.