Oct 03,2023 20:32

ప్రజాశక్తి - తిరుపతి సిటీ : తిరుపతి ఆర్‌టిసి బస్టాండ్‌లో అపహరణకు గురైన బాలుడిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌పి మీడియాకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు... తిరుపతి ఆర్‌టిసి బస్టాండులో చెన్నై ప్లాట్‌ ఫామ్‌ రిజర్వేషన్‌ టికెట్‌ కౌంటర్‌ దగ్గర చెన్నైకి చెందిన అరుల్‌మురుగన్‌ అనే బాలునితో తల్లిదండ్రులు మీనా, చంద్రశేఖర్‌, అన్న మోఘన వసంత్‌తో పాటు నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి మురగన్‌ కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని అవిలాల సుధాకర్‌ అనే వ్యక్తి అపహరించినట్లు సిసిటివి ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. సోషల్‌ మీడియాలో ఈ విషయం ప్రచారం కావడంతో ఏర్పేడు మండలం మాధవమాల గ్రామంలోని తన అక్క నెల్లూరి ధనమ్మ ఇంటి వద్ద బాలుడిని వదిలిపెట్టి నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడిని రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని, ఆయన అక్కను, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంటల్లోనే బాలుడిని రక్షించిన పోలీసులను ఎస్‌పి అభినందించారు.